-->

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు

ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల హక్కుల కోసం అసెంబ్లీలో ప్రస్తావన

కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల హక్కుల కోసం రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించడంపై షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డదని, అక్కడ నివసిస్తున్న ఎస్సీ కులాల ప్రజలు నిత్యజీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే సాంబశివరావు అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లక్షలాదిమంది ఎస్సీ ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చిందని ప్రశంసించారు.

ప్రభుత్వాన్ని కోరిన ప్రధాన డిమాండ్లు

  • ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధిపై రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెట్టాలి.
  • స్థానికంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలి.
  • పోడు భూములపై ఎస్సీ రైతులకు హక్కు పత్రాలు మంజూరు చేసి, రైతు భరోసా, రైతు రుణం, రైతు బీమా వర్తింపజేయాలి.
  • అంగన్వాడీ, ఆయా, అటెండర్, సిపరు తదితర ఉద్యోగ నియామకాలను వెంటనే చేపట్టాలి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ఈ అంశాలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి.

ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి గౌరవ సలహాదారు సింగరేణి రిటైర్డ్ జీఎం ఏ. ఆనందరావు, రాష్ట్ర నాయకులు ఇనుముల వెంకటేశ్వర్లు, కొమ్ము శ్రీరాములు, రాసమల్ల నరసయ్య, మ్యాచెస్, కండే రాములు, దాసరి యాకయ్య, సుందర్ పాల్, మెంతన మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల హక్కుల పరిరక్షణకు కీలక మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Blogger ఆధారితం.