హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం?
హైదరాబాద్ లోకల్ అథారిటీన్ ప్రజా ప్రతినిధుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండేలా ఉంది.
కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండేందుకు ప్రధాన కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తనకు తగినంత బలం లేకపోవడమేనని సమాచారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను పరిశీలించిన కాంగ్రెస్, పోటీకి దిగినా విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఈ ఎన్నికల్లో తాము నిలబెట్టే అభ్యర్థికి తగిన మద్దతు లభించదనే భావనతోనే వెనుకడుగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎంపీల మద్దతు మజ్లిస్‌కు?
ఇక మరోవైపు, మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏ నిర్ణయం వెల్లడించనప్పటికీ, తమ ఓట్లు ప్రత్యర్థి బీజేపీకి వెళ్లకుండా ఉండటానికి మజ్లిస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదా?
ఇక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న ఓట్లు 25 లోపే ఉండగా, మజ్లిస్ పార్టీకి ఉన్న ఓట్లలో సగం ఓట్లు కూడా బీజేపీకి లేవు. దీంతో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ రాగానే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. బీజేపీకి సరిపడిన సంఖ్యాబలం లేకపోవడంతో చివరికి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎన్నికల బలాబలాలు - ఓట్ల గణాంకం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓట్లు 110 ఉండగా, తుది జాబితాలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. అందులో కార్పొరేటర్లు 81 మంది కాగా, ఎక్స్ అఫిషియో సభ్యులు 29 మంది ఉన్నారు. ఈ ఓటర్ల బలాబలాలను బట్టి, ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ లభిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలు హైదరాబాద్ రాజకీయ వాతావరణాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే!
Post a Comment