ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి అమీన్‌పూర్‌లో విషాదం
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా కలత చెందిన ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన భోజనం పెట్టి, తానూ ఆహారం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగింది.
తల్లి రజిత అమానుష చర్య
రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)లకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించింది. తాను కూడా అదే ఆహారం తీసుకుంది. విషం ప్రభావంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. భర్త చెన్నయ్యకు మాత్రం ఆమె పప్పు అన్నం మాత్రమే పెట్టినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణ
ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు రజితను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే కారణమా?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కుటుంబ సమస్యల కారణంగా రజిత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఆమె, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని అనుమానిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment