నాటుసార స్థావరాలపై పోలీసుల దాడులు
భద్రాది కొత్తగూడెం జిల్లాలో నిషేధిత గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు ఈరోజు మధ్యాహ్నం మెరుపు దాడి చేశారు.
ఈ దాడులు కరకగూడెం మండల పరిధిలోని కౌలూరు అటవీ ప్రాంతంలో జరిగాయి. సమాచారం మేరకు, కొందరు వ్యక్తులు రహస్యంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని నిషేధిత గుడుంబా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలిసి ఆయా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో గుడుంబా తయారీకి వినియోగించే సుమారు 3,000 లీటర్ల పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. అంతేగాక, నిషేధిత మద్యం తయారీ మరియు విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరకగూడెం ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ, "గుడుంబా తయారీ, విక్రయం పూర్తిగా నేరపూరిత చర్య. దీనిని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారు. ఎవరైనా గుడుంబా తయారీకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు" అని స్పష్టం చేశారు.
కరకగూడెం మండలంలో ఎవరైనా వ్యక్తులు గుడుంబా తయారు చేస్తుంటే లేదా అమ్మకానికి ఉంచితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసుల చర్యను స్థానికులు అభినందించారు. నాటుసార నిర్మూలనకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Post a Comment