కొత్తగూడెం క్లబ్ లో దవాత్ -ఎ- ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కూనంనేని
కోత్తగూడెం పట్టణంలో మతసామరస్యాన్ని ప్రదర్శిస్తూ, లౌకిక విలువలను కాపాడే ఉద్దేశంతో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. శుక్రవారం కొత్తగూడెం క్లబ్బులో జరిగిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి పాల్గొని మత సామరస్యానికి తమ మద్దతును ప్రకటించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఇఫ్తార్ విందుల వంటి కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, సమాజంలో శాంతిని నెలకొల్పేలా దోహదపడతాయని అన్నారు.
రంజాన్ మాసం ఉపవాస దీక్ష ద్వారా ముస్లిం సోదరులు త్యాగం, సహనాన్ని పాటిస్తూ, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందిస్తున్నారని, ఇది మన సమాజానికి గొప్ప సందేశమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల విశ్వాసాలను గౌరవించేలా ఉండాలని, మతాలు, కులాల మధ్య సౌహార్దం పెంపొందించడంలో ఇలాంటి సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రహమాన్, మత గురువులు మహమ్మద్ మునావర్ హుస్సేన్, అబ్దుల్ అజిజ్ మంజార్, మత పెద్దలు జహంగీర్ షరీఫ్, రబ్, అబీద్ హుస్సేన్, జావీద్ సాటే, బాసిత్, ఖాద్రి, యాకుబ్, సిపిఐ నాయకులు దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళి, తూము చౌదరి, నాగా సీతారాములు, పల్లపోతు సాయి, మాజీ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం సాంప్రదాయ వేడుకలకు సరైన ఉదాహరణగా నిలిచింది. మతాల మధ్య ఐక్యత, సహనాన్ని ప్రోత్సహిస్తూ, సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేలా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని హాజరైన నేతలు అభిప్రాయపడ్డారు.
Post a Comment