త్వరలో కొత్త రూ.10, రూ.500 నోట్లు వచ్చేస్తున్నాయా?
రూపాయి నోట్ల పరంపరలో మరోసారి మార్పులకు రంగం సిద్ధమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త రూపంలో రూ.10, రూ.500 నోట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. తాజా మార్పుల్లో ప్రత్యేకత ఏమిటంటే... ఈ నోట్లపై ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకాలు ఉంటాయి.
ప్రస్తుతం ప్రజల వద్ద చలామణిలో ఉన్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల మాదిరిగానే కొత్త నోట్లు ఉండబోతున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. రూపాయి డినామినేషన్ మారనప్పటికీ, డిజైన్, రంగు, పరిమాణాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రూ.500 నోట్ల పరిమాణాన్ని 66 మిల్లీమీటర్ల వెడల్పు, 150 మిల్లీమీటర్ల పొడవుతో నిర్ణయించారని చెబుతున్నారు. కొత్త నోట్లు కొద్దిగా తేడాతో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత నోట్లతో సమాన విలువే కలిగినవిగా చలామణిలో ఉండనున్నాయి.
గతంలో విడుదల చేసిన రూ.10, రూ.500 నోట్లు చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయని స్పష్టంగా తెలిపింది. ప్రజలు కొత్త నోట్ల రాకతో పాత నోట్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ హామీ ఇచ్చింది.
ఇప్పటికే మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్‌బీఐ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబరులో సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించగా, పదవీ కాలం మొత్తం ఆరు సంవత్సరాలు ఉంటుంది. శక్తికాంత దాస్ పదవీకాలం పూర్తయ్యాక ఆయన స్థానంలో నియమితులయ్యారు.
ప్రతి కొత్త గవర్నర్ చేరిన తర్వాత తమ సంతకాలతో కూడిన నోట్లను జారీ చేయడం ఆచారం. దానిలో భాగంగానే ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక చూస్తుండగానే మార్కెట్‌లో కొత్త రూపంలో నోట్లు దర్శనమివ్వనున్నాయి.
Post a Comment