-->

రామవరం అంబేద్కర్ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు

రామవరం అంబేద్కర్ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న సింగరేణి కార్మిక ప్రాంతమైన రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో (మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో) మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ వేడుకలకు మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ, పూలే గారు 1827, ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారని చెప్పారు. ఆయన తండ్రి గోవిందరావు పూలే పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారని పేర్కొన్నారు.

ఆ కాలంలో దళిత, బహుజన ప్రజలు ఎన్నో సామాజిక దాడులకు గురయ్యేవారని, వారికి విద్యాపై హక్కు లేకుండా చేస్తున్న దుర్వినియోగాన్ని పూలే గారు ఎదుర్కొన్నారని అన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేకు స్వయంగా విద్యను నేర్పి, 1848లో దళిత బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయిని నిలిపారని వివరించారు.

1873 సెప్టెంబర్ 24న ఆయన స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ద్వారా విద్యతో పాటు మహిళలకు హక్కులు కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన 1890 నవంబర్ 28న మృతి చెందారు. జ్యోతిరావు పూలేకు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1954లో బిబిసి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ప్రేరణ ఇచ్చిన ముగ్గురు గురువులలో జ్యోతిరావు పూలే పేరు ప్రస్తావించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, నాయకులు మాతంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, సావటి స్వామి, కూరగాయల శ్రీను, ఇండిగపల్లి శంకర్, కాంపెళ్లి దుర్గయ్య, తిప్పారపు ఎల్లయ్య, నాగేల్లి మొగిలి, శనిగారపు కుమారస్వామి, కొత్తూరి రవి, మాటేటి అంజయ్య, మద్దికుంట గణేష్, నమిల్ల మధు, ఎస్.కె నాగుల్ మీరా, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

సభ అనంతరం మహాత్మ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో కార్యక్రమం ముగిసింది.

Blogger ఆధారితం.