-->

వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం

వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం


దిల్లీ: వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 288 ఓట్లు అనుకూలంగా, 232 ఓట్లు వ్యతిరేకంగా నమోదయ్యాయి. ఈ బిల్లు పట్ల విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాలు తీవ్ర విమర్శలు చేయగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు సమర్థంగా సమాధానం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన చర్చ గురువారం తెల్లవారుజాము 2.15 గంటల వరకూ కొనసాగింది. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు తిప్పికొట్టబడ్డాయి.

బిల్లుకు ఎన్డీయే ప్రధాన భాగస్వామ్య పక్షాలు తెదేపా, జేడీ(యు), శివసేన (శిందే), లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) మద్దతివ్వడంతో భాజపాలో ఉత్సాహం పెరిగింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేయడం గమనార్హం. వైకాపా కూడా బిల్లును వ్యతిరేకించింది. బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది.

ప్రభుత్వం వైఖరి

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ, వక్ఫ్‌ బిల్లు ముస్లింలకు మేలు చేసేదేనని, దీనిపై అనవసరంగా అపోహలు కల్పిస్తున్న వారిని హెచ్చరించారు. వక్ఫ్‌ ఆస్తులను కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని, బిల్లుతో అవినీతికి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిన సవరణలు అన్యాయమైనవని విమర్శించారు. వక్ఫ్‌ బోర్డుల్లో సమూల మార్పులు రాబోతున్నాయని భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.

విపక్షాల అభ్యంతరాలు

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బిల్లులోని నిబంధనలను తీవ్రంగా తప్పుబట్టారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత గౌరవ్‌ గొగొయ్‌ మాట్లాడుతూ, ఈ బిల్లు రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై దాడి అని, మైనారిటీలను అప్రతిష్ఠ పాల్జేయడానికి తీసుకొచ్చారని విమర్శించారు. మత ధ్రువీకరణ పత్రం పొందాల్సిన నిబంధనను తీవ్రంగా వ్యతిరేకించారు.

రాహుల్‌ గాంధీ స్పందన

లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వం ముస్లింల వైయుక్తిక చట్టాల్లో జోక్యం చేసుకుని, వారి ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భాజపా, ఆరెస్సెస్‌ భవిష్యత్తులో ఇతర మతాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయని హెచ్చరించారు. ఈ వక్ఫ్‌ బిల్లు పై రాజ్యసభలో చర్చ జరగాల్సి ఉంది. బిల్లుకు సంబంధించిన తదుపరి పరిణామాలు కీలకంగా మారనున్నాయి.


Blogger ఆధారితం.