-->

తెలంగాణ: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్..!

తెలంగాణ: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్..!


హైదరాబాద్ నగరంలో అకాల వర్షాల ప్రభావం తీవ్రమైన స్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నగరంలో పరిస్థితులను సమీక్షించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం, ఈదురుగాలుల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రోడ్లపై నిలిచిన నీటిని తక్షణమే తొలగించేందుకు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. కాలనీల్లో జలమయం అయిన ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించాలని అన్నారు.

పోలీసులను క్షేత్రస్థాయిలో మోహరించి, ట్రాఫిక్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 100 ప్రాంతాల్లో 90 హైదరాబాద్లోనే ఉన్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లో 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, హిమాయత్‌నగర్‌లో 9.6, డబీర్పురాలో 9.45, సరూర్‌నగర్‌లో 9.35, నాంపల్లిలో 9.43, ముషీరాబాద్‌లో 9.43 సెం.మీ వర్షపాతం నమోదయింది.

వాతావరణ శాఖ ప్రకారం, హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. యాదాద్రి, రంగారెడ్డి, జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించుకోవాలని సూచించింది.


Blogger ఆధారితం.