-->

రూ. 500 నోట్లతో జాగ్రత్తగా ఉండండి... మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ

రూ. 500 నోట్లతో జాగ్రత్తగా ఉండండి... మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ


దేశంలో నేరాలు రూపురేఖలు మార్చుకుంటూ కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ పెరిగినా, చట్టాలు కఠినంగా ఉన్నా నేరగాళ్లు కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు. ఇటీవల మార్కెట్లో నకిలీ రూ. 500 నోట్ల సర్క్యులేషన్ గణనీయంగా పెరిగింది. దీన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

నకిలీ నోట్ల మోసం – సిద్ధిపేటలో ఘటన:

తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అక్కడి ఓ మహిళా గ్రూప్ లీడర్, గ్రూప్ సభ్యుల నుంచి సేకరించిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లింది. అయితే బ్యాంకు అధికారులు ఓ రూ. 500 నోటు నకిలీగా గుర్తించారు. దానిని చింపి పడేసిన వారు, ఆ లీడర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆమె ఆ మొత్తాన్ని నష్టపోయింది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

కేంద్ర హోంశాఖ అలర్ట్:

నకిలీ నోట్ల పెరుగుతున్న సర్క్యులేషన్‌పై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. ప్రజలు, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని సీబీఐ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ వంటి ముఖ్యమైన దర్యాప్తు సంస్థలకు తెలియజేసింది.

నకిలీ నోట్లు అత్యధిక నాణ్యతతో ముద్రించబడ్డాయి. వీటిని చూస్తే అసలైన నోట్లలా కనిపిస్తున్నాయి. వాటిలోని వాటర్‌మార్కులు, రంగు, సైజు, ఫీచర్లు అన్నీ ఒరిజినల్ నోట్లతో సమానంగా ఉండటంతో సామాన్యులకు తేడా గమనించడం చాలా కష్టంగా మారింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నకిలీ రూ. 500 నోటు ఎలా గుర్తించాలి?

తాజాగా కేంద్ర హోంశాఖ ఒక ముఖ్యమైన క్లూ వెల్లడించింది. నకిలీ రూ. 500 నోట్లలో చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని తెలిపింది. “RESERVE BANK OF INDIA” అనే పదబంధంలో “RESERVE” అనే పదాన్ని “RASERVE”గా ముద్రించారని వెల్లడించింది. అంటే “E” అక్షరం స్థానంలో “A” ఉంది. ఇది ఒక స్పష్టమైన సూచన.

అందుకే చేతిలోకి రూ. 500 నోటు వచ్చిన ప్రతీసారి, దానిపై ఉన్న అక్షరాలను, ఫీచర్లను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ చిన్న గమనికే పెద్ద మోసం నుంచి తప్పించగలదు.

ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తత చాలా ముఖ్యం. ముఖ్యంగా రూ. 500 వంటి పెద్ద విలువ గల నోట్లను స్వీకరించేటప్పుడు ఖచ్చితంగా ఫీచర్లు పరిశీలించాలి. చిన్న తప్పిదం కూడా మనకి నష్టాన్ని కలిగించవచ్చు. నకిలీ నోట్లపై పూర్తి అవగాహనతో ముందడుగు వేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం “అనంతజనశక్తి న్యూస్”ని ఫాలో అవ్వండి.

Blogger ఆధారితం.