లారీ బీభత్సం: ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న హోంగార్డ్ మృతి, ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌లో లారీ బీభత్సం: ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న హోంగార్డ్ మృతి, ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా అదుపు తప్పి ట్రాఫిక్ పోలీసులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డ్ సింహాచలం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించగా, ఇద్దరు ట్రాఫిక్ పోలీసులకు గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం, కూకట్‌పల్లి నుండి మియాపూర్ వైపు వస్తున్న లారీ యూటర్న్ సమీపంలో ఉన్న ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు రాజవర్ధన్, వికేందర్ మరియు హోంగార్డ్ సింహాచలం ప్రమాదానికి గురయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సింహాచలం తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన అనంతరం పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణ ప్రాంతంలో ఇలా ప్రమాదం జరగడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సముచిత చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment