-->

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణచివేయాలనే మోదీ కుట్ర: కాంగ్రెస్ నేతల ధర్నా

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణచివేయాలనే మోదీ కుట్ర: కాంగ్రెస్ నేతల ధర్నాగాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణచివేయాలనే మోదీ కుట్ర: కాంగ్రెస్ నేతల ఆరోపణలు

హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్ సహా అనేకమంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కుల గణన అజెండా ప్రధాని మోడీకి శిరోభారం అయింది. దానిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబంపై కుట్రలు చేస్తున్నాడు. మేము మా పార్టీ పత్రికకు అప్పుగా ఇచ్చిన డబ్బుల విషయంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎలా వస్తాయో మాకు అర్థం కావడం లేదు” అని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, “ఈడీ ఛార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంలో మోడీ భయభ్రాంతి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపడుతుందన్న భయంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాడు,” అని విమర్శించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మోదీ రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడు. చట్టాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం. బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాకు చట్టం పాఠాలు చెప్తే అర్థం లేదు. విచారణను ఎవరూ అడ్డుకోవడం లేదు. మేము మీ పార్టీ లా మూర్ఖులు కాదు,” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ నేతలు తెలిపారు. గాంధీ కుటుంబానికి మద్దతుగా, మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారు గళం విప్పారు.

Blogger ఆధారితం.