రైల్వేస్టేషన్ వద్ద యువతిపై అఘాయిత్యం: ధైర్యంగా కీచకులకు ఎదిరించిన యువతి
మేడ్చల్, : ఆడపిల్లలకు సురక్షిత వాతావరణం లేకుండా పోతున్న పరిస్థితులు రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు సామాజిక భద్రతను ప్రశ్నిస్తున్నాయి. తాజాగా మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘటన మరోసారి ఈ విషయంలో పోలీసుల అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది.
ఒక యువతి ఒంటరిగా మేడ్చల్ రైల్వే స్టేషన్ దిశగా వెళ్తుండగా, ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. తమ ఉన్మాదానికి గురి చేయాలని ప్రయత్నించిన కీచకులకు యువతి ధైర్యంగా ఎదిరించింది. భయపడకుండా వారితో గట్టిగా పోరాడింది. రాళ్లతో వారిపై దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. యువతి ధైర్యానికి దుండగులు దిగదుడుపుగా పరుగులు తీసినప్పటికీ, కొంతదూరం వరకు ఆమెను వెంబడించారని తెలుస్తోంది.
ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలవ్వడంతో స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న యువతి, తనపై జరిగిన దాడి గురించి వివరంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన కారణంగా కేసును రైల్వే పోలీసులకు (జీఆర్పీ) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.
ఇటీవలే ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మళ్లీ ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గంజాయి మత్తులో కొంతమంది యువకులు ప్రయాణికులకు విఘాతం కలిగిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల పరిసర భద్రతను పటిష్ఠం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక గస్తీ బలగాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనను ప్రాధాన్యతతో తీసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో యువతి చూపించిన ధైర్యం ప్రశంసనీయం. ఆమె వంటి ధైర్యవంతులే సమాజానికి మేలుకలిపే ఉదాహరణలుగా నిలుస్తున్నారు.
Post a Comment