రెపో రేట్లు మరోసారి తగ్గించిన ఆర్బీఐ – రుణదారులకు ఊరట
రెపో రేట్లు మరోసారి తగ్గించిన ఆర్బీఐ – రుణదారులకు ఊరటనిచ్చే నిర్ణయం
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నిర్వహించిన త్రైమాసిక సమీక్షలో రెపో రేటును మరోసారి తగ్గిస్తూ ప్రకటించింది. ఈ సారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ రాజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ తగ్గింపు తర్వాత రెపో రేటు 6 శాతానికి పరిమితమైంది.
మూడు నెలల క్రితమే గవర్నర్ రాజీవ్ మల్హోత్రా తొలిసారి త్రైమాసిక సమీక్ష నిర్వహించినప్పుడు కూడా అదే స్థాయిలో రెపో రేటును తగ్గించారు. వరుసగా రెండవసారి కూడా అదే ధోరణిని కొనసాగించిన మల్హోత్రా, వడ్డీ రేట్ల తగ్గింపుతో దేశ ఆర్థిక వ్యవస్థను చైతన్యవంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
రెపో రేటు అంటే ఏమిటి?
రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి తాత్కాలికంగా రుణాలు తీసుకునేటప్పుడు చెల్లించే వడ్డీ రేటు. ఇది తగ్గితే, ఆ ప్రభావం వాణిజ్య బ్యాంకుల ద్వారా ప్రజలకు ఇచ్చే రుణాలపై పడుతుంది. అంటే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లు కూడా తగులుతాయి.
జనానికి ఊరటనిచ్చే నిర్ణయం
తాజా తగ్గింపుతో గృహ రుణాల వడ్డీ రేట్లు 8 శాతానికి దిగిరావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల రుణగ్రాహకులపై నెలవారీ ఈఎమ్ఐ భారం కొంత తగ్గనుంది. అలాగే కొత్తగా రుణం తీసుకునే వారికి ఇది బంగారు అవకాశంగా మారుతుంది.
ఆర్థిక వ్యవస్థకు ఊతం
రుణ వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ప్రజలు ఎక్కువగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల ఖర్చులను పెంచి మార్కెట్ లో డిమాండ్‌ను పెంచుతుంది. బ్యాంకులకు రుణాల విస్తరణ ద్వారా ఆదాయం పెరగనుంది. వెరసి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది.
గవర్నర్ మార్పుతో ధోరణిలో మార్పు
మునుపటి గవర్నర్ శక్తికాంత దాస్ హయాంలో వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. అయితే రాజీవ్ మల్హోత్రా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వడ్డీ రేట్లను తగ్గించే ధోరణి కనిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు గుణప్రదంగా మారే అవకాశముందని నిపుణుల అభిప్రాయం.
Post a Comment