ఇంటర్ ఫలితాలు విడుదల – ఉత్తీర్ణత శాతాల్లో బాలికలదే పైచేయి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం 66.89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 71.37 శాతం విద్యార్థులు విజయం సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినట్టు అధికారులు తెలిపారు.
ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షలకు కలిపి 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలికల విజయ శాతం బాలుర కంటే ఎక్కువగా నమోదైంది. ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, సెకండియర్‌లో 77.73 శాతం ఉత్తీర్ణత సాధించారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇది బాలికల విద్యలో పెరుగుతున్న చైతన్యాన్ని సూచిస్తోందన్నారు.
ఇదిలా ఉంటే, ఫలితాల్లో అనుమానం ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఇంటర్ బోర్డు ఒక వారం గడువు ఇచ్చింది. అలాగే మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, "ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ప్రయత్నాలకు శుభఫలితాలొచ్చాయి. ఎవరు నిరాశ చెందకండి, అవకాసాలు ఇంకా ఉన్నాయి," అని సూచించారు.
ఇంటర్ ఫలితాల ప్రకటన విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించగా, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్, తదితర సమాచారం కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
Post a Comment