ఐదుగురు కొడుకులున్నా అనాధగా మారిన వృద్ధురాలు
వృద్ధాశ్రమం కన్నా రోడ్డే ఆశ్రయం!
ఐదుగురు కొడుకులున్నా అనాధగా మారిన వృద్ధురాలు.
గాంధీ ఆసుపత్రి ఎదుట బాధాకర దృశ్యం
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఒక వృద్ధురాలు శరీరంలో తిండి లేక ఎముకలు తేలిపోయిన పరిస్థితిలో నిరాశగా పడుకున్న దృశ్యం స్థానికుల గుండెల్ని కలిచేసింది. ఆమె పేరు కాశమ్మ, వయస్సు 90 ఏండ్లు. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఈ వృద్ధురాలికి ఐదుగురు కుమారులు ఉన్నప్పటికీ, చివరకు ఆశ్రయం కోసం రోడ్డుపై పడాల్సి వచ్చింది.
"నా మనవడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడు... అప్పటి నుంచి తిరిగి రాలేదు..." అంటూ కన్నీటి పర్యంతమవుతున్న ఆమె పరిస్థితి చూసి అక్కడే ఉన్న ప్రజలు చలించిపోయారు. దయతలచిన కొంతమంది స్థానికులు ఆమెకు నీళ్లు, తిండి ఇవ్వడంతో పాటు కనీసంగా ఒక నీడ ఉండే చోటికి మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
వృద్ధురాలి అనాధ స్థితిని గమనించిన స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు – ఆమెకు తక్షణ సహాయం అందించి, ఒక వృద్ధాశ్రమంలో చోటు కల్పించి, మానవత్వం చాటాలని కోరుతున్నారు. ఆమెకు కుటుంబసభ్యులు ఉన్నా, ఈ వయస్సులో అలా రోడ్డుపై పడేయడం, సమాజం ఎదుట గుణపాఠంగా మారాల్సిన అంశమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగం మరియు సమాజం చిత్తశుద్ధిని పరీక్షించే ఘటనగా నిలిచింది. మరి ఈ వృద్ధురాలికి వెలుగు చూపే చేయి ఎప్పుడు అందుతుంది?
Post a Comment