-->

క్రికెట్ ఆడతామని వెళ్లి, మునిగి మృతి చెందిన ఇద్దరు చిన్నారులు

క్రికెట్ ఆడతామని వెళ్లి, మునిగి మృతి చెందిన ఇద్దరు చిన్నారులు


ఖమ్మం నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మూడో పట్టణ ప్రాంతానికి చెందిన ఇద్దరు పదోతరగతి విద్యార్థులు క్రికెట్ ఆడతామని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన తర్వత అనంతలోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కూచిపూడికి చెందిన బెన్విత్ (14) మరియు అన్నంపల్లి కిరణ్ తేజ (14) అనే ఇద్దరు స్నేహితులు మంగళవారం సాయంత్రం సమయంలో క్రికెట్ ఆడతామని బయటకు వెళ్లారు. అయితే, వారు క్రికెట్ ఆడేందుకు కాకుండా, దానవాయిగూడె ప్రాంతంలోని మున్నేరు వాగు వద్ద ఈతకు వెళ్లారు.

ఈతలో అనుభవం లేనందున, 18 అడుగుల లోతులోకి దూకిన వారు మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ అప్పటికే వారు మృతి చెంది ఉన్నారు. ఇటీవలే పదవ తరగతి పరీక్షలు ముగించుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు, ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లినట్లు బంధువులు తెలిపారు.

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ భాను ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన మరోసారి, పిల్లలు ఏదైనా అభిరుచికర కార్యకలాపాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

Blogger ఆధారితం.