యూపీఐ డౌన్: ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే పనిచేయడం లేదు – వినియోగదారుల గగ్గోలు
శనివారం మధ్యాహ్నం సమయంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు బందయ్యాయి. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి ప్రాచుర్యం పొందిన డిజిటల్ పేమెంట్ యాప్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
టెక్నికల్ సమస్య కారణంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడిందని సమాచారం. ఈ సమస్య వల్ల చాలా మంది డిజిటల్ లావాదేవీలను పూర్తిచేయలేకపోయారు. సోషల్ మీడియాలో వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. "పేమెంట్ ఫెయిలయింది", "యాప్ లోడ్ కావడం లేదు", "ట్రాన్సాక్షన్ జరిగిందో లేదో అర్థం కావడం లేదు" వంటి పోస్టులు విపరీతంగా వెలువడ్డాయి.
సాంకేతిక సమస్య తీవ్రతను బట్టి చూస్తే, ఈ వ్యవధిలో దాదాపు 1200 మందికి పైగా యూపీఐ పేమెంట్స్ పై రిపోర్టులు చేశారు. వీరిలో 66 శాతం మంది పేమెంట్ సమయంలో సమస్యను ఎదుర్కొన్నారని, మరో 34 శాతం మంది ఫండ్ ట్రాన్స్‌ఫర్ కుదరలేదని పేర్కొన్నారు.
ఇప్పటికే గత నెలలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులు ఇటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పుడు కూడా యూపీఐ సేవలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.
ప్రస్తుతం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎలాంటి సమస్య తలెత్తిందో, ఎప్పట్లో పరిష్కారం కుదురుతుందన్న విషయంపై అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ తరహా సమస్యలు తరచుగా ఎదురవ్వడం వల్ల డిజిటల్ పేమెంట్ యాప్‌లపై వినియోగదారుల్లో నమ్మకం దెబ్బతింటోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Post a Comment