ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి తన తల్లి దుర్మరణం ఆటో డ్రైవరుకు జైలు శిక్ష
కొత్తగూడెం: ఆటో డ్రైవరుకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కే. సాయి శ్రీ గురువారం తీర్పు వెల్లడించారు. 2017 జూలై 4న జరిగిన ఈ ఘటనలో, తిరువూరు కు చెందిన బిస్తు లాల్ బహదూర్ తన కుమారుడైన బిస్తు ధన్ బహదూర్ డ్రైవింగ్ చేస్తున్న ఏపీ 16 టీ వై 8651 నంబరు గల ఆటోలో తన భార్య బిస్తూ రమాదేవి, వదిన పనగల జయమ్మతో కలిసి కుక్కునూరు వెళ్లారు. వీరు వ్యవసాయ భూముల ముంపు ప్రాంత పరిహారం తీసుకునేందుకు వెళ్ళినట్టు సమాచారం.
రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో మద్దుకూరు దాటాక కట్టుగూడం మూలమలుపు వద్ద ఆటో అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిస్తూ రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా, పనగల జయమ్మకు తీవ్ర గాయాలు కలిగాయి. డ్రైవర్ బిస్తు ధన్ బహదూర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై అప్పటి అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఈ. చంద్రమౌళి ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేశారు. అనంతరం, అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీను దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించిన అనంతరం, కోర్టు బిస్తు ధన్ బహదూర్‌ను దోషిగా నిర్ధారించింది. అతనికి 7 నెలల జైలు శిక్షతో పాటు ₹2000 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను జి. విశ్వశాంతి నిర్వహించారు. కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎస్. కె. అబ్దుల్ ఘని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె. సురేష్ లు ఈ విచారణకు సహకరించారు.
Post a Comment