-->

కామారెడ్డిలో మరోసారి కల్తీ కల్లు బాగోతం బట్టబయలు

కామారెడ్డిలో మరోసారి కల్తీ కల్లు బాగోతం బట్టబయలు

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు మరోసారి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో జరిగిన తాజా ఘటన కలకలం రేపుతోంది. గ్రామంలోని ఓ కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగిన తరువాత సుమారు 30 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో, వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన కుస్తీ పోటీల సందర్భంగా చోటుచేసుకుంది. పోటీలను తిలకించేందుకు వచ్చిన గ్రామస్తులు స్థానికంగా ఉన్న కల్లు దుకాణంలో కల్లు సేవించి, త‌ర్వాత వింత ప్రవర్తన చేయడం మొదలుపెట్టారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతున్నారు.

ఇది ఒక్కటే కాకుండా, మంగళవారం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోనూ కల్తీకల్లు తాగిన కేసు వెలుగుచూసింది. అక్కడి ఓ కల్లు దుకాణంలో కల్లు తాగిన 22 మంది వింతగా ప్రవర్తించారు. బాధితుల్లో అంకోల్, సంగెం, హాజీపూర్, దుర్కి గ్రామాలకు చెందినవారు ఉన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కల్తీ కల్లు ఘటనల నేపథ్యంలో ప్రజల్లో భయం, ఆందోళన నెలకొంది. కల్తీ కల్లు వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఎక్సైజ్ అధికారులు రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు మాఫియాపై అధికార యంత్రాంగం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందన్నది గోప్యంగా మారింది. ఇప్పటికే పలువురు బలైపోతున్నా, శాశ్వత పరిష్కారం లేకపోవడం ప్రభుత్వంపై ఎన్నో ప్రశ్నలు లేపుతోంది.

Blogger ఆధారితం.