బంగారం చోరీ ఘటనపై ఎస్‌బీఐ వద్ద బాధితుల ఆందోళన
రాయపర్తి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జరిగిన బంగారం చోరీ ఘటనపై బాధితులు గురువారం ఉదయం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ విలువైన బంగారం బ్యాంకులో ఉంచగా, గత నవంబర్ 19న అది చోరీకి గురైంది. కానీ ఇప్పటివరకు తమ ఆస్తిని తిరిగి పొందలేదని బాధితులు వాపోయారు.
చోరీ జరిగిన ఐదు నెలలైనప్పటికీ ఎస్‌బీఐ అధికారులు తమను మోసం చేస్తున్నారని, తరచూ వాయిదాలు వేస్తూ న్యాయం దూరం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాధితులు గురువారం ఉదయం బ్యాంకు ఎదుట తాళం వేసి నిరసన చేపట్టారు. బ్యాంకు సిబ్బందిని బయటకు పంపించి, బ్యాంక్ గేటుకు తాళం వేసిన బాధితులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు.
“మా బంగారం మాకు ఇవ్వాలి. మేము సంవత్సరాలుగా పొదుపుగా ఉంచిన బంగారం ఇలా పోవడం బాధాకరం. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం” అని బాధితుల్లో ఒకరు వాపోయారు. ఈ ఘటనపై సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన స్పందన రాకపోవడంతో, బాధితులు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment