భూ సమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టం
భూ సమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టం – ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశం
భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ‘భూ భారతి’ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదిక లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ చట్టాన్ని ప్రజలకు అంకితమిచ్చారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతు కమిషన్ సభ్యులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
- గత పాలకుల కారణంగా భూ వ్యవస్థపై ప్రజల్లో ఏర్పడిన అపోహలను తొలగించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా నిలబెట్టే ప్రసక్తే లేదని, వ్యవస్థపై కాదు, తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తప్పకుంటాయని హెచ్చరించారు.
- భవిష్యత్తులో భూములకు ఆధార్ లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కల్పించే ‘భూధార్’ పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఇందులో భూమి కొలతలు, హద్దులు, యాజమాన్య వివరాలు మొదలైనవన్నీ ఉంటాయని వివరించారు.
- ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో మొదటి విడతగా అమలు చేయనున్నట్లు చెప్పారు.
- ప్రజల్లోకి చట్టాన్ని తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులదేనన్నారు. రెవెన్యూ అధికారులను ప్రజలకు మరింత చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
- ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను స్వయంగా విని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- భూ భారతిని రూపొందించడంలో ఎన్నో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఇది ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గమని వివరించారు.
- గ్రామాలస్థాయిలో ప్రజా దర్బార్లు, అవగాహన సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఈ చట్టం అమలుతో తెలంగాణలో భూ వివాదాలు తగ్గి, రైతులకు భద్రతా భావన కలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Post a Comment