ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. పేదలకు నివాసం కల్పించాలనే ముఖ్యాశయంతో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా, మొదటి విడతగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా అతి పేద, వాస్తవిక అర్హత కలిగిన కుటుంబాలకే ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది కుటుంబాలకు ఆశాకిరణం లభించనుంది.
మంగళవారం హైదరాబాద్ శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం సందర్భంగా ఈ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొత్తం 12 మంది లబ్ధిదారులకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారికి చెక్కులు అందజేశారు. అందులో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. పథకంలోని మొదటి చెక్కును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మికు ఇవ్వడం విశేషం. ఆమెతోపాటు మరికొందరికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష విలువగల చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "పేదల కలలగున్న ఇంటి ఆశయాన్ని నిజం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా నిజమైన అర్హుల జీవితాలలో మార్పు తీసుకొస్తాం," అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పథకానికి మంచి ఆరంభం లభించింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Post a Comment