పెద్దపల్లి జిల్లాలో భూకంప హెచ్చరిక – ప్రజల్లో భయాందోళన
పెద్దపల్లి జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ హెచ్చరించింది. ఈ నెల 10 నుండి 17 తేదీ మధ్య భూకంపం సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా రామగుండం పరిధిలో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ మేరకు సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రామగుండం వద్ద భూకంప సూచనలు కనిపించాయని తెలిపింది. దీంతో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ ప్రాంతం పారిశ్రామిక కార్యకలాపాలకు కేంద్రమై ఉండటంతో, భూకంపం సంభవించినట్లయితే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలే బ్యాంకాక్, మయన్మార్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో రామగుండానికి సంబంధించి వచ్చిన హెచ్చరిక మరింత ఆందోళనకు కారణమైంది.
రామగుండం ప్రాంతంలో సింగరేణి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు విస్తృతంగా ఉన్న కారణంగా, భూకంప ప్రభావం అధికంగా ఉండే అవకాశాన్ని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రతపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Post a Comment