బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు ముగ్గురు మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్,: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్‌కు చెందిన బీజాపూర్ జిల్లా అడవుల్లో శనివారం ఉదయం భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని అధికార వర్గాలు ధృవీకరించాయి.
బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, నేషనల్ పార్క్ ఏరియా పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు, ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడ్డారు.
దీనితో అక్కడ ఉదయం నుంచే రెండు వర్గాల మధ్య తీవ్ర కాల్పులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకూ అడపాదడపా కాల్పులు కొనసాగినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు అని తెలుస్తోంది. గాయపడిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
సమాచారం మేరకు, మృతుల వద్ద నుంచి ఆయుధాలు, పేలుడుకర సామగ్రి, ఇతర విలువైన సమాచార పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి, ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.
ఈ ఘటన నేపథ్యంలో బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. గ్రామాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానితులపై నిఘా ఉంచుతున్నారు. మావోయిస్టుల కదలికలపై మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Post a Comment