సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు!
హైదరాబాద్, టాలీవుడ్‌లో సంచలనం రేపిన విషయమిది. తెలుగు సినిమా రంగంలో అగ్రతారగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆయన ఈనెల 27వ తేదీన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
ఈడీ ఈ చర్యకు దిగిన కారణం హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూపు కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తే. ఈ రెండు సంస్థలు భారీ స్థాయిలో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.
మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇందుకోసం ఆయనకు దాదాపు రూ.5.9 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. అందులో కొంత భాగం నగదు రూపంలో కాగా, మిగిలినది ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా మారినట్లు తెలుస్తోంది.
ఈడీ ఇటీవల ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో పట్టుబడిన పత్రాల్లో మహేష్ బాబుకు డబ్బులు చెల్లించిన వివరాలు బయటపడ్డాయి. దీంతో ఈడీ ఆయనను విచారణ కోసం పిలిపించింది.
ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా సురానా గ్రూపుపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ విచారణను ప్రారంభించింది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఈడీ ఈ సంస్థలపై విస్తృతంగా దాడులు జరిపింది.
ఈ పరిణామాలు సినీ పరిశ్రమలో కలకలం రేపగా, మహేష్ బాబు ఈ విచారణలో ఏ విధంగా స్పందిస్తారో, ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.
Post a Comment