-->

మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మంచు మనోజ్

 

మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మంచు మనోజ్

మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మంచు మనోజ్ – కుటుంబ వివాదం మళ్లీ చర్చనీయాంశం

హైదరాబాద్:  బాబు కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడినట్లు కనిపిస్తోంది. తాజాగా మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్ బుధవారం ఉదయం హైదరాబాద్‌ జల్‌పల్లి ప్రాంతంలో ఉన్న మోహన్ బాబు నివాసానికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఆయన గేటు వద్దే కూర్చొని నిరసన తెలిపారు.

మంగళవారం తన కారు అదృశ్యమైనట్టు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది వారి సోదరుడు విష్ణు ప్రేరేపిత చర్యగా ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ, గేటు మూసివేయడంతో తీవ్ర అసంతృప్తితో అక్కడే నిరసన బైఠాయించారు.

ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్, ఇది ఆస్తి వివాదం కాదని స్పష్టం చేశారు. “ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. డిసెంబర్ నుంచే గొడవలు జరుగుతున్నా, ఇంకా ఛార్జ్‌షీట్ ఫైల్ చేయలేదు. కత్తులు, గన్‌లతో మమ్మల్ని బెదిరించేందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించాను,” అని పేర్కొన్నారు.

అలాగే, హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తనను ఇంట్లోకి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. “ఇంట్లో నా పెంపుడు కుక్క పిల్లలు ఉన్నాయి. వాటిని ఇవ్వమని అడిగినా నిర్లక్ష్యం చూపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలి. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా – నేను ఎప్పుడూ ఆస్తి కోసం పోరాడలేదు. విష్ణుకి నేను అంటే కుళ్లు. కోర్టు ఆదేశాల్ని విస్మరించి తప్పుడు సంతకాలతో వ్యవహారం మలుపు తిప్పుతున్నారు,” అని ఆరోపించారు.

ఇక ఈ ఘటనపై మరింత స్పందన రావాల్సి ఉండగా, మంచు కుటుంబం అంతర్గత సమస్యలు మరోసారి పరోక్షంగా జనంలోకి రాగా, పరిస్థితి ఎటు వెళ్లనుందన్నదిపై ఆసక్తి నెలకొంది.

Blogger ఆధారితం.