కోటిరూపాయల ఆస్తి కోసం సవతితల్లి చేతిలో యువతి హత్య
హైదరాబాద్‌లో హత్య చేసి మూసీ వాగులో పాతిపెట్టిన ఘటన – పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగు
జనగామ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మూసీ వాగులో దహనమైన స్థితిలో గుర్తించిన యువతి మృతదేహం పోలీసుల దర్యాప్తులో జటావత్ మహేశ్వరి (పెద్ద భార్య కుమార్తె)గా గుర్తింపు పొందింది. ఆమె జనగామ జిల్లా దేవరఉప్పల మండలం పడమటి తండా (డి) గ్రామానికి చెందినవారిగా తెలిపారు.
ఆస్తి కోసం కూతురిని పొట్టనబెట్టుకున్న లలిత
మహేశ్వరి తండ్రి ఈనా నాయక్ రెండో భార్య లలిత, కోటి రూపాయల విలువ చేసే ఇంటిపై కన్నేసి, ఆస్తిని సొంతం చేసుకోవాలన్న లోభంతో హత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. మహేశ్వరి వివాహానికి కట్నంగా ఇల్లు ఇవ్వాలని ఈనా నాయక్ మాటిచ్చినట్టు సమాచారం. ఈ ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న దురాశతో లలిత, తన మేనబావ అయిన ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో గత ఏడాది డిసెంబరులో మహేశ్వరి హత్య చేసింది.
హైదరాబాద్‌లో హత్య... వంగమర్తి వద్ద శవాన్ని పాతిపెట్టారు
హత్య అనంతరం, మృతదేహాన్ని హైదరాబాద్ నుండి తీసుకువచ్చి వంగమర్తి గ్రామంలోని మూసీ వాగులో పాతిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
లలిత నేరాన్ని అంగీకరించిందని పోలీసులు వెల్లడి
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న లలిత విచారణలో నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హత్యలో లలితకు సహకరించిన ఇతరుల వివరాలు కూడా గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.
Post a Comment