తెలంగాణ కొత్త సీఎస్‌గా కె. రామకృష్ణారావు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (CS) కొత్తగా కె. రామకృష్ణారావు ను నియమించే అవకాశాలపై స్పష్టత వస్తోంది. ప్రస్తుతం సీఎస్‌గా కొనసాగుతున్న శాంతి కుమారి పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుండగా, ఆమె పదవీ విరమణకు ముందు వీఆర్‌ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం.
శాంతి కుమారి 1989 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. 2023 జనవరి నుండి రాష్ట్ర సీఎస్ పదవిని నిర్వర్తిస్తూ రాష్ట్రంలో అనేక పరిపాలనా విధానాలను అమలు చేశారు. ఆమె పదవీకాలం ముగియడానికి ఇంకా కొన్ని వారాలు ఉన్నప్పటికీ, వీఆర్‌ఎస్ తీసుకుని తదుపరి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఆమె తరువాత ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమర్థంగా ముందుకు నడిపించారు. ఆయన అనుభవం, పరిపాలనా నైపుణ్యం సీఎస్ పదవికి అనువైనదిగా ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తరువాతి స్థానంలో ఉన్నారు. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో పదవీ విరమణ పొందనున్నారు. అప్పటివరకు సీఎస్ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లినట్లు తెలిసింది.
రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు కలెక్టర్‌గా కూడా సేవలందించారు. పలు కీలక స్థానాల్లో తన పరిపాలనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
ఇక శాంతి కుమారి వీఆర్‌ఎస్ అనంతరం, ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నియామకం ఇప్పటికే ఖరారైనదిగా తెలుస్తోంది. అధికారిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. వచ్చే వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో, శాంతి కుమారితో పాటు మరికొందరిని సమాచార కమిషనర్లుగా నియమించే అవకాశం ఉంది.
Post a Comment