తెలంగాణ రైజింగ్" ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా సాగుతుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని "తెలంగాణ రైజింగ్" ప్రతినిధి బృందం జపాన్ పర్యటనను విజయవంతంగా ప్రారంభించింది. పర్యటనలో భాగంగా, తొలి రోజునే ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ రాష్ట్రానికి కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకోవడంలో బృందం గొప్ప విజయం సాధించింది.
మరుబెనీ కార్పొరేషన్‌తో కీలక ఒప్పందం
జపాన్‌కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ మరుబెనీ కార్పొరేషన్ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. టోక్యోలో జరిగిన సమావేశంలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి, హైదరాబాద్ సమీపంలో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో “నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్” ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.
రూ.1,000 కోట్ల ప్రాథమిక పెట్టుబడి
మరుబెనీ కార్పొరేషన్, ఫ్యూచర్ సిటీలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమల కోసం ఆధునిక పార్క్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ. 1,000 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు మరుబెనీ ప్రతినిధులు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) పై సంతకాలు చేశారు.
భవిష్యత్తులో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు
ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా జపాన్ మరియు ఇతర అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ తయారీ యూనిట్లను స్థాపించనున్నాయి. దీని ద్వారా రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. అలాగే, 30,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి.
పరిశ్రమలపై దృష్టి
ఈ పార్క్‌లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టనున్నారు. ఇది నైపుణ్య ఉపాధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, తెలంగాణ రైజింగ్‌లో భాగంగా తెలంగాణను అధునాతన పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, “ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని, దీనిలో మరుబెనీ ప్రాజెక్ట్ ఒక పతాక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.” పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్-జపాన్ మైత్రీ బంధం బలపడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరుబెనీ స్పందన
మరుబెనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దయ్ సకాకురా మాట్లాడుతూ, “తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాము. సీఎం దార్శనికతను అభినందిస్తున్నాము. రాష్ట్ర అభివృద్ధికి మా భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నాం,” అని తెలిపారు.
మరుబెనీ పరిచయం
మరుబెనీ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయం, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ తదితర రంగాల్లో ప్రబలంగా ఉంది. సుమారు 50,000 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ఒప్పందం తెలంగాణ భవిష్యత్తును కొత్త దిశగా నడిపించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ, గ్లోబల్ పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తూ, అభివృద్ధి దిశగా వేగంగా కదులుతుంది.
Post a Comment