-->

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థులు ధైర్యంగా ఉండాలి మేలో మరో అవకాశం

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థులు ధైర్యంగా ఉండాలి మేలో మరో అవకాశం


తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరిక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ప్రతి ఏడాది ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన, ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం, సమాజం, తల్లిదండ్రుల దృష్టి ఎక్కువగా బాలల మానసిక స్థితిపై కేంద్రీకృతమవుతోంది.

పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాకపోతే విద్యార్థులు తాము పరాజయాన్ని ఎదుర్కొన్నట్లు భావిస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది జీవితాన్ని నిర్ణయించదని పిల్లలు గ్రహించకపోవడం అత్యంత విచారకరం. తల్లిదండ్రుల కోపం, నిరాశతో భయపడుతూ చిన్నారులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుత పోటీ యుగంలో మార్కులు, ర్యాంకుల ఆధారంగా మాత్రమే ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పేరున్న విద్యాసంస్థలలో చేర్పించాలనే తల్లిదండ్రుల ఆశయాలు పిల్లలపై అనవసర ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించకుండా చదువు, మార్కుల పైనే దృష్టి పెట్టడం వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

విద్యా సంస్థల్లో పోటీ, ఇంట్లో తల్లిదండ్రుల వత్తిడి మధ్య విద్యార్థులు తట్టుకోలేక నిష్ప్రయోజనత భావంతో తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో స్నేహంగా మెలిగి, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. వారు ఫెయిల్ అయినా, అది చివరి అవకాశం కాదని గుర్తు చేయాలి. మే నెలలో జరిగే సంప్లిమెంటరీ పరీక్షలు మరొక అవకాశం కల్పిస్తాయి.

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, స్నేహితులతో సాన్నిహిత్యం ఎంతో అవసరం. ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చకుండా, తక్కువ చేయకుండా ప్రోత్సహించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ద్వారా సహాయం అందించాలి.

విద్యార్థులు ధైర్యంగా ఉండాలి. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదనే విషయాన్ని మనస్సులో గట్టిగా నాటుకోవాలి. మనోధైర్యమే భవిష్యత్తుకు బలమైన శ్రేయస్సు మార్గమని తెలుసుకోవాలి.

Blogger ఆధారితం.