డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ జీవిత సాఫల్యం, ఆయన సేవలు, ప్రత్యేకించి అణగారిన వర్గాల కోసం చేసిన పోరాటం గురించి సీఎం ఘనంగా కొనియాడారు. మహిళల సాధికారత కోసం చేసిన కృషి ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రజా పాలనకు మార్గదర్శకంగా నిలుస్తున్నదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి చర్యల ద్వారా సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేస్తోందని చెప్పారు.
అంబేద్కర్ పేరిట ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విద్యను అందుబాటులోకి తెస్తున్నామని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తున్నామని వివరించారు. బాబాసాహెబ్ కలలు నిజం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులూ పాల్గొన్నారు.
Post a Comment