-->

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్!

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్!


హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపుగా నిలిచే బీఆర్ఎస్‌ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభకు శనివారం సాయంత్రం వరంగల్ జిల్లా పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, కాజీపేట రూరల్‌ ఏసీపీ కార్యాలయం నుండి అధికారిక అనుమతి పత్రాలు జారీయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్‌ భాస్కర్, ఒడితల సతీశ్ కుమార్‌లు పోలీసుల నుంచి అనుమతి పత్రాలను స్వీకరించారు.

గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతులు నిరాకరించిన ఉదంతాలు ఉన్న నేపథ్యంలో, ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్న అనుమానంతో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే హైకోర్టును ఆశ్రయించింది. న్యాయమార్గంలో అనుమతి కోరిన నేపథ్యంలో, ఈ కేసు ఇప్పుడు పరిష్కార దశకు చేరుకుంది.

నిన్న సాయంత్రం పోలీసులు అధికారికంగా అనుమతి ఇవ్వడంతో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకునే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే రజతోత్సవ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.

ఈ అనుమతితో బీఆర్ఎస్ పార్టీకి ఊపొచ్చినట్లయ్యింది. రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Blogger ఆధారితం.