రేవంత్ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నాం: కేటీఆర్
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనాత్మక ప్రకటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ), కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, సీవీసీ, ఎస్ఎఫ్ఐవోలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 10 వేల కోట్ల భారీ కుంభకోణానికి పథకం వేశారని, ఇది నిక్కచ్చిగా ఆర్థిక నేరమేనని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారని, "క్విడ్ ప్రో కో" విధానంలో రేవంత్ రెడ్డి సర్కారుకు ఆయన సహకరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. అయితే ఆ ఎంపీ పేరు ప్రస్తుతం చెప్పబోనని, సరైన సమయంలో ఈ వివరాలను బయటపెడతానన్నారు.
ఇది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియకుండా జరుగుతోందని తనకు నమ్మకముందని, అయితే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే, బీజేపీ – కాంగ్రెస్ కుమ్మక్కయినట్లు అర్థమవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజల ముందు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడమే తమ తదుపరి దశ అని, ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠత నెలకొంది. కేంద్రం స్పందించే తీరుపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Post a Comment