ఢిల్లీకి చేరుకున్న కిరాతకుడు తహవూర్ హుస్సైన్ రాణా
2008 ముంబయి ఉగ్రదాడులకు సంబంధించి ప్రధాన నిందితుల్లో ఒకడైన తహవూర్ హుస్సైన్ రాణా గురువారం నాడు ఢిల్లీకి చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విమానంలో ఢిల్లీకి తరలించిన ఈ ఉగ్రవాదిని, నిఘా సంస్థలు అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకురాగలిగాయి.
తహవూర్ రాణాను అమెరికా నుంచి ఇండియాకు తరలించేందుకు అమెరికా అధికారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన విమానం నుంచి రాణాను బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రధాన కార్యాలయానికి తరలించారు.
రాణా రాక నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచారు. కమాండోలు, సాయుధ బలగాలు మోహరించబడి, ఎయిర్‌పోర్ట్ చుట్టూ ప్రతి చలనం పైనా నిఘా ఉంచారు. రాణా ప్రయాణించిన కాన్వాయ్‌కు పోలీస్ యాక్సార్టు కూడా ఏర్పాటు చేశారు.
NIA అధిక భద్రత నడుమ రాణాను విచారించనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం అతన్ని తీహార్ జైలుకు తరలించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దర్యాప్తు వ్యవహారాన్ని నడిపించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తహవూర్ రాణా 2008 ముంబయి పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆయన భారతీయ నిఘా సంస్థల చేతిలో కీలక సమాచారం ఇచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు విచారణకు ఇది కీలక మలుపుగా మారనుంది.
Post a Comment