-->

సింగరేణి ఆసుపత్రిలో ఔషధాల కరువు - కార్మికుల ఆవేదన

సింగరేణి ఆసుపత్రిలో ఔషధాల కరువు - కార్మికుల ఆవేదన


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సింగరేణి, రాష్ట్రంలోని ఒక పెద్ద సంస్థగా పేరొందిన సంస్థ అయినా, అక్కడి కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అంత తేలికైనవి కావని తాజాగా వెలుగు వచ్చిన ఓ విషయం తెలియజేస్తోంది. సింగరేణి ఆసుపత్రిలో పలు అవసరమైన ఔషధాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.

తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు కొన్ని కీలకమైన టాబ్లెట్లు అందుబాటులో లేవన్న మాట వినిపిస్తోంది. ఈ పరిస్థితిని చూసి “పేరు గొప్ప ఊరు దిబ్బ” అన్న చందంగా సింగరేణి ఆసుపత్రి నిర్వహణ సాగుతోంది అనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇదే సమస్యను గతంలోనూ సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరించారని, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో, రిటైర్డ్ కార్మికులు, ప్రస్తుత కార్మికుల కుటుంబ సభ్యులు "కార్మిక సంఘాలు ఏమి చేస్తున్నాయి?" అని ప్రశ్నిస్తున్నారు.

ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు, వారి కుటుంబాలు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, రాజ్ ఠాకూర్ మరియు మక్కాన్ సింగ్ లను కోరుతున్నారు. కార్మికుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారే ముందు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమస్య తక్షణమే పరిష్కారమవాలని, బాధితులకు అవసరమైన ఔషధాలు నిరంతరంగా అందించాలనే ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు.

Blogger ఆధారితం.