-->

ఎట్టకేలకు సారీ చెప్పిన ఇన్స్టాగ్రామ్ పచ్చళ్ళ అలేఖ్య చిట్టి

 

ఎట్టకేలకు సారీ చెప్పిన ఇన్స్టాగ్రామ్ పచ్చళ్ళ అలేఖ్య చిట్టి

తప్పు చేశాను.. క్షమించండి.. ఎట్టకేలకు సారీ చెప్పిన ఇన్స్టాగ్రామ్ పచ్చళ్ళ అలేఖ్య చిట్టి

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా చర్చకు కేంద్రబిందువైన అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదానికి ఎట్టకేలకు ఒక మలుపు వచ్చింది. రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లైన అలేఖ్య, సుమ, రమ్య కంచర్లల నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారం "అలేఖ్య చిట్టి పికిల్స్" పేరుతో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇటీవల ఓ కస్టమర్ పచ్చళ్ళ ధరల గురించి ప్రశ్నించగా, అలేఖ్య ఇచ్చిన అసభ్యకరమైన ఆడియో రిప్లై నెట్టింట్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ ఆడియోలో ఉపయోగించిన భాషా శైలి, బూతులు విన్న నెటిజన్లు షాక్ అయ్యారు. కస్టమర్ ఆ ఆడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఇది విపరీతంగా వైరల్ అయింది. ఫలితంగా ‘బాయ్‌కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ, వారి వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నది. విమర్శల తూటాల మధ్యలో అలేఖ్య చిట్టి వారి వెబ్‌సైట్‌ను నిలిపివేయగా, వాట్సాప్ నెంబర్‌ను కూడా డిలీట్ చేశారు.

ఈ వివాదం ఆగకపోవడంతో, నెటిజన్ల ఒత్తిడికి లోనై, ఎట్టకేలకు అలేఖ్య చిట్టి ఓ వీడియో ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ – “నేను అలేఖ్య చిట్టిని. నేను తప్పు చేశాను. ఇప్పటివరకు నేను తిట్టినవాళ్లందరినీ హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను” అని అన్నారు.

అలేఖ్య క్షమాపణ చెప్పడంతో కొంతమంది నెటిజన్లు ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆమె క్షమాపణను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం పచ్చళ్ళ వ్యాపారంపై ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

ఇంతలోనే ఆ ఆడియో క్లిప్‌ను కొందరు సినిమాల ప్రమోషన్లకు వినూత్నంగా వాడుకుంటూ వైరల్ చేస్తుండటం గమనార్హం. అలేఖ్య చిట్టి పికిల్స్ మళ్లీ వ్యాపార రంగంలోకి వస్తాయా? లేదా? అనే విషయం మాత్రం కాలమే చెప్పాలి.

Blogger ఆధారితం.