వక్ఫ్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ చట్టం మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే మద్దతుగా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణను నేడు సుప్రీంకోర్టు చేపట్టనుంది.
మధ్యాహ్నం 2 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణకు కూర్చునే అవకాశముంది.
ఇటీవలే పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే చట్టం ప్రకటన తరువాత దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు డజన్కుపైగా గాయాలపాలయ్యారు. పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని పలు సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో, వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తూ ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి.
విభిన్న అభిప్రాయాలతో కూడిన ఈ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో, దేశ రాజకీయంగా, మత సామరస్య పరంగా కీలకమైన తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. విచారణలో న్యాయస్థానం ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తుందన్నది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Post a Comment