భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవం సీఎం రేవంత్ రెడ్డి
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో ఈ రోజు (ఏప్రిల్ 6) శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ మిథిలా మండపంలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తిరస పరవశ్యంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు.
కళ్యాణమూర్తులను శోభాయాత్ర రూపంలో అలంకరించి, మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయాన్ని పుష్పాలతో, వెలుగులతో అత్యంత శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు “సీతారామ చంద్రునికి జయ” అంటూ గర్భగుడి ప్రాంగణాన్ని మార్మోగించారు.
ఈ కళ్యాణోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా హాజరుకానున్నారు. ఆయన ఈ ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా భద్రాచలం చేరుకుంటారు. ముందుగా భద్రాద్రి రామలక్ష్మణ సీతామ్మ వారిని దర్శించుకుని, వారి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం ప్రభుత్వ తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించి, మిథిలా మండపంలో జరిగే కళ్యాణ వేడుకలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమానంతరం, మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి వెళ్లి ఓ రేషన్ కార్డుదారుడి ఇంటికి వెళ్లి భోజనాన్ని తీసుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
ఈ విధంగా భద్రాచలంలో జరగుతున్న శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం, భక్తుల భక్తి పారవశ్యాన్ని పుష్కలంగా చాటుతుంది. ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా హాజరుకావడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది.
Post a Comment