కారులో ఆడుకుంటూ చిన్నారుల దుర్మరణం
రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో విషాదం: కారులో ఆడుకుంటూ చిన్నారుల దుర్మరణం
రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల నడుమ ఆటలాడుకుంటున్న చిన్నారులు ఇద్దరు ఊపిరాడక మరణించిన ఘటన గ్రామాన్ని షాక్‌కు గురిచేసింది. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య, అనసూయల కుమారుడు రాంబాబుకు ఈ నెల 30న వివాహం జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లి ఏర్పాట్ల కోసం రాంబాబు అక్కాచెల్లెల్లు — సీతారాంపూర్‌కు చెందిన ఉమారాణి, పామెన గ్రామానికి చెందిన జ్యోతి తమ పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం దామరగిద్దకు వచ్చారు.
ఇంట్లో పెళ్లి ఏర్పాట్లతో పాటు రంగుల పనులు కొనసాగుతుండటంతో పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమారాణి చిన్న కూతురు అభినయశ్రీ (4), జ్యోతి చిన్న కూతురు తన్మయశ్రీ (5) ఇంటి ముందున్న కారులోకి ఎక్కారు. ఆడుకుంటూ కారు డోర్లు మూసేయడంతో అవి లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించలేదు.
పిల్లలంతా బయట ఆడుకుంటున్నారన్న ఊహతో కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ సుమారు రెండు గంటల తర్వాత అభినయశ్రీ, తన్మయశ్రీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే వారి కోసం వెతికారు. చివరికి పార్క్ చేసిన కారులో వారిని గుర్తించారు. అప్పటికే చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారు ఊపిరాడక స్పృహ తప్పిపోయారు.
వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు పరీక్షించి వారు మరణించినట్టు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన దామరగిద్దతో పాటు సీతారాంపూర్, పామెన గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు, కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తే ఎవరైనా కన్నీరు ఆపుకోలేరు. ఒక పండుగ వాతావరణం క్షణాల్లో విషాదంగా మారింది.
Post a Comment