-->

మణుగూరులో ఏసీబీకి చిక్కిన విలేకరి గోపి – సీఐ సతీష్ లంచం కేసులో అరెస్ట్

మణుగూరులో ఏసీబీకి చిక్కిన విలేకరి గోపి – సీఐ సతీష్ లంచం కేసులో అరెస్ట్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఓ న్యూస్ ఛానల్ విలేకరి మరియు పోలీసు శాఖకు చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఏసీబీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం – మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎన్ఎస్ చట్టంలోని 384(4), 329(3) సెక్షన్ల కింద క్రైం నెం. 150/2025గా కేసు నమోదైంది. ఈ కేసులో మామ, అల్లుళ్లకు సహాయం చేయాలంటే రూ. 4 లక్షల లంచం ఇవ్వాలని మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ డిమాండ్‌ను అమలు చేయడంలో బిగ్ టీవీ విలేకరి మిట్టపల్లి గోపి మధ్యవర్తిగా వ్యవహరించాడు. లంచం మొత్తాన్ని దశలవారీగా చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో – మొదటి విడతగా లక్ష రూపాయల నగదును ఫిర్యాదుదారు గోపికి అప్పగిస్తుండగా, ఏసీబీ అధికారులు ముందస్తుగా వేసిన వ్యూహంలో గోపిని సోమవారం మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో పట్టుకున్నారు.

చర్యల సందర్భంగా గోపి వద్ద లభించిన నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, అతని వేలిముద్రలను రసాయన పరీక్షలకు పంపింది. గోపి నగదు తీసుకున్నట్టుగా అంగీకరించడంతో పాటు పరీక్షల్లో కూడా అదే తేలిందని అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మణుగూరు సీఐ సతీష్ కుమార్‌ను A1గా, బిగ్ టీవీ విలేకరి మిట్టపల్లి గోపిని A2గా నిర్ధారించిన ఏసీబీ, వీరిద్దరినీ అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ప్రకటించింది. ఈ ఘటనతో స్థానిక పోలీస్ విభాగంలో కలకలం రేగగా, మీడియా వర్గాల్లో కూడా చర్చలకు దారితీసింది. అధికార దుర్వినియోగం మరియు విలేకరి పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Blogger ఆధారితం.