మద్యం మత్తులో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రీయ నగర్‌లో నిన్న రాత్రి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న మహేష్ అనే వ్యక్తి తన భార్య శ్రీదేవి మరియు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే, మహేష్ అనే యువకుడు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవించాడని తెలుస్తోంది. శ్రీదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న మహేష్, ఇటీవల కాలంలో భార్యతో తరచూ గొడవ పడుతున్నట్టు సమాచారం. నిన్న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేష్, శ్రీదేవితో ఘర్షణకు దిగాడు. కోపానికి లోనైన అతడు, మద్యం మత్తులో ఉండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో శ్రీదేవి తల్లికి మెడపై తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమెను ఐసియులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పెళ్లి తరువాత అనేక విభేదాలు, చిన్నపాటి మనస్పర్థలతో మహేష్-శ్రీదేవి మధ్య సంబంధాలు బాగా క్షీణించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Post a Comment