ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో ప్రమాదంలో బయటపడిన జిలిటిన్ స్టిక్స్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ సమీపంలో రోడ్డుప్రమాదం భయానక దృశ్యాలకు దారి తీసింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒక ఆటో అకస్మాత్తుగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కరీంనగర్ నుండి జగిత్యాల దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆటో గట్టిగా ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ షాక్‌కి గురిచేసింది.
బోల్తాపడిన ఆటోలో రెండు పెద్ద కార్టన్ బాక్సులు బయటపడగా, వాటిలో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం అనంతరం అప్రమత్తమైన ఆటో డ్రైవర్ తన తప్పును దాచేందుకు ప్రయత్నించాడు. జిలిటిన్ స్టిక్స్ ఉన్న రెండు బాక్సులను పక్కనే ఉన్న మురికినీటి కాలువలో పడేసి అక్కడి నుండి పరారయ్యాడు.
ప్రమాదం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జిలిటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భారీ విస్ఫోటకాలు తీసుకెళ్తున్న ఆటో బస్సును ఢీకొట్టడం వల్ల పెను ప్రమాదం తప్పిందనే మాట అందరి నోటా వినిపిస్తోంది.
పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ స్టిక్స్ ఎక్కడినుంచి తరలించారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు వాటి వెనక ఉన్న కుట్ర ఏమిటి? అన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment