దారుణం... కర్కశంగా మారిన కన్నతల్లి – టీచర్స్ కాలనీలో విషాదం
పెద్దపల్లి జిల్లాలో ఓ విషాద ఘటన జరిగింది. మానవత్వాన్ని ప్రశ్నించేలా ఓ తల్లి తాను కన్న పాపను కర్కశంగా హత్య చేసి, అనంతరం తానే తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, కాలనీలో నివసిస్తున్న సాహితీ అనే మహిళ (27) మూడు సంవత్సరాల వయసున్న తన కుమార్తె వితన్య రెడ్డి గొంతు నలిపి చంపేసింది. అనంతరం తీవ్ర మనోవేదనతో తాను ఇంటిలోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన తీవ్ర సంతాపాన్ని కలిగిస్తోంది.
సాహితీ భర్త వేణు, ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన జగిత్యాలలో ఓ వివాహానికి వెళ్లి ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తన భార్య, కుమార్తె మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సాహితీ మానసికంగా స్థిరంగా లేనన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఒక తల్లి తాను కన్న పాపను చంపిన తీరు అందరినీ కలచివేస్తోంది.
Post a Comment